ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2 లక్షలమంది వలసకార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్ర ఆళ్ల నాని వెల్లడించారు. అలాగే ఇతర రాష్ట్రాల వలస కూలీలు 12,794 మంది మన రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. వీరందరినీ స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
9 ప్రత్యేక రైళ్ల ద్వారా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వలస కూలీలను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రక్రియ చేపడుతున్నామని మంత్రి అన్నారు. మొదటి దశలో వలస కార్మికులు, రెండో దశలో విద్యార్థులు, యాత్రికులు, పర్యటకులను తరలిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని వారు వచ్చే లోపే క్వారంటైన్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక క్వారంటైన్ చొప్పున లక్ష పడకలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని వివరించారు.
మరోవైపు రాష్ట్రంలో 4 రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 1,14,937 కరోనా టెస్టులు చేశామని వెల్లడించారు. ఇందులో 1583 పాజిటివ్ కేసులు రాగా.. 488మంది డిశ్చార్జి అయ్యారని అన్నారు.ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని... కనీస జాగ్రత్తలు పాటించాలని కోరారు. టెలీ మెడిసిన్ ద్వారా వైద్యులు ప్రిస్కిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోనే మందులు ఇంటికి చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఇదీ చదవండి