రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతకు తగ్గట్లు నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రయోగశాలల్లో మాత్రమే రోజుకు 570 నమూనాలు పరీక్షిస్తున్నారు. విజయవాడ సిద్దార్థ, తిరుపతి స్విమ్స్, కాకినాడ, అనంతపురం, గుంటూరు, కడప బోధనాసుపత్రుల్లో మాత్రమే నమూనాలను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఒక పరీక్ష ప్రారంభించిన ఐదారు గంటలకు కానీ ఫలితాలు రావడం లేదు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి పొందిన ప్రయోగశాలల్లోనే పరీక్షలు జరగాల్సి ఉన్న కారణంగా ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.
11 రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి
దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతులిచ్చినా.. ఈ జాబితాలో రాష్ట్రానికి చోటు దక్కలేదు. ఒక్కో అత్యాధునిక ల్యాబ్‌ను కేవలం 2 నుంచి 3 కోట్ల రూపాయలతో అందుబాటులోకి తీసుకురావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఏపీలో ఏర్పాటు చేస్తే కరోనా కేసుల సంఖ్యను త్వరగా గుర్తించడం సహా నివారణ చర్యలను వేగవంతం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇలా..
రాష్ట్రం | అందుబాటులో ఉన్న ల్యాబ్‌లు |
తెలంగాణ | 15 |
మహారాష్ట్ర | 23 |
తమిళనాడు | 17 |
కేరళ | 12 |
మన రాష్ట్రంలో ఈ సంఖ్య 6కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నిర్మూలించాలంటే మూలాల్లోకి వెళ్లి శోధించేందుకు ఈ ప్రయోగశాలలు ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ల్యాబ్‌ల సంఖ్య పెరిగితే సమయం సహా రోగులపైనా ఖర్చు భారం తగ్గుతుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి: