కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరులో ఈనెల 6న జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
హత్యలకు కారణమేంటి?
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బడబాగ్ని రామాంజనేయ రాజు 2018లో తన కూతురు చరిష్మాని బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరు గ్రామానికి చెందిన అంజనమ్మ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అదనపు కట్నంతో చరిష్మాని అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా 2019లో చరిష్మాను దారుణంగా హత్య చేశారు.
చరిష్మా హత్యకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్న బడబాగ్ని రామాంజనేయ రాజు.. తన తమ్ముడు బడబాగ్ని శ్రీనివాస రాజుతోపాటు పేర్ని వెంకట వరప్రసాద్ రాజు, బడబాగ్ని బ్రహ్మ నారాయణమ్మలతో కలిసి చరిష్మా అత్త అంజనమ్మ, ఆడపడచు వరలక్ష్మమ్మలను అతి దారుణంగా కత్తులతో పొడిచి.. గొంతుకోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. చరిష్మా హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు చేశారని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.
అసలేం జరిగింది..
వరకట్న వేధింపులతో అంజనమ్మ కోడలు చరిష్మా 2019లో హత్యకు గురైంది. అప్పట్లో చరిష్మా తల్లిదండ్రులు.. అంజనమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవిపై కేసు పెట్టారు. అత్తింట్లోనే చరిష్మా మృతదేహాన్ని సమాధి కట్టించారు. అయితే హత్య కేసులో బెయిల్ రావడంతో అంజనమ్మ, లక్ష్మీదేవి.. తిరిగి గ్రామానికి వెళ్లలేక బ్రహ్మంగారిమఠంలో నివాసముంటున్నారు.
ఆగస్టు 6న నేలటూరులో ఉంటున్న తన తల్లిని చూసేందుకు అంజనమ్మ, కుమార్తె లక్ష్మీదేవి.. మనవడుతో కలిసి గ్రామానికి వెళ్లింది. సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. ప్రతీకార చర్యలో భాగంగానే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చరిష్మా సమాధి వద్దనే హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి.విజయ్‌కుమార్, సీఐ బీవీచలపతి, ఎస్సై శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి