కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యాధునిక వైద్య సదుపాయాలు లేక..వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామని తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు రాష్ట్రంలో లేకపోయినా.. కరోనా నియంత్రణలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచినట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ సచివాలయాలు సమర్థంగా పని చేశాయని తెలిపారు.. ఇప్పటివరకూ 12 సార్లు ఫీవర్ సర్వే నిర్వహించి..లక్షణాలు ఉన్నవారిని గుర్తించి..కరోనా విస్తరణను అడ్డుకోగలిగామని ప్రధానికి తెలిపారు.
రాష్ట్ర విభజనకు ముందు మాకు హైదరాబాద్ ఉండేది. విభజన తర్వాత మా రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేవు. అయినప్పటికీ మీ మార్గదర్శకత్వంలో కరోనా వైరస్‌ని చెప్పుకోదగ్గ రీతిలోనే నియంత్రించగలిగాం. ప్రతీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయాలు వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో నిజంగా సహాయం అందించాయి. 12 సార్లు ఇంటింటికి ఫీవర్ సర్వేలు నిర్వహించి..ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని గుర్తించగలిగాం. అలాంటి వారిపై దృష్టి పెట్టి కొవిడ్ పరీక్షలు చేయించడం వల్ల కరోనా వ్యాప్తిని నియంత్రంచగలిగాం.-సీఎం జగన్
వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గం
వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా నివారణకు సరైన మార్గమని.. సీఎం జగన్ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన టీకాలను..తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ప్రధాని మోదీని మరోసారి కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే లేఖ ద్వారా కోరిన సీఎం జగన్..వీడియో కాన్ఫరెన్స్‌లోనూ మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కోటీ 68 లక్షలా 46వేల 210 వ్యాక్సిన్ డోసులు..వచ్చాయన్న సీఎం జగన్..ఇప్పటివరకూ కోటీ 76 లక్షలా 70 వేల 642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల.. ఇచ్చిన దానికన్నా ఎక్కువ మందికి టీకాలు వేయగలిగామని సీఎం తెలిపారు.
జులై నెలకు గానూ 53 లక్షల 14 వేల 740 వ్యాక్సిన్లు రాష్ట్రానికి కేటాయించారు. జులైలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు గానూ 17 లక్షల 71 వేల 580 డోసులు కేటాయించారు. కానీ.. వాస్తవంగా ప్రైవేటు ఆసుపత్రులు వాటి సామర్థ్యం మేరకు టీకాలు వేయలేకపోతున్నాయి. జూన్ నెలలో 4 లక్షల 20 వేల 209 డోసులు మాత్రమే వేయగలిగారు. కాబట్టి ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన టీకాల్లో వినియోగించకుండా మిగిలిపోయిన డోసులు కూడా తిరిగి రాష్ట్రానికే కేటాయించాలి.
కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ సలహాలు, సూచనలు మార్గదర్శకాలు పాటిస్తూ ముందుకు సాగుతామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: