Penamaluru CI Suspension: కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ ఎం. కిషోర్ బాబు, బ్లూకోట్స్ హెడ్ కానిస్టేబుల్ రామారావుపైనా సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం చెందడం, అవినీతిపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏలూరు రేంజి డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ శనివారం కిషోర్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలిసింది. రఫీ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేయడం, దీనిపై డీఎస్పీ జయసూర్య మధ్యాహ్నం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత గంట వ్యవధిలోపే ఆయన సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ అయింది. రేంజి డీఐజీ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు డీఎస్పీ జయసూర్యకు సాయంత్రం మూడు గంటలకే చేరగా వీటిని సీఐకు అందజేయడానికి ఆయన ప్రయత్నించినా సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయడం, ఆచూకీ తెలియకపోవడంతో డీఎస్పీ గంటల తరబడి పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఎదురుచూసినట్లు తెలిసింది.
Retired IRS Theft Case : రిటైర్ట్ IRS శామ్యూల్ కేసు.. దుండిగల్ SI కృష్ణ సస్పెండ్
ఆరోపణల నేపథ్యంలోనే..: కిషోర్‌బాబు పెనమలూరులో బాధ్యతలు తీసుకొని 5 నెలలు కావస్తుండగా ఈ మధ్య కాలంలో పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 హత్యలు జరిగాయి. రౌడీషీటర్లలపై పూర్తిస్థాయి నిఘా లేకపోవడం, కానూరు, తాడిగడప, యనమలకుదురు, పోరంకి, ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా నియంత్రించలేకపోవడం సీఐ సస్పెండ్‌కు కారణాలుగా తెలుస్తోంది. రౌడీషీటర్ల కదలికలపై పూర్తి స్థాయి నిఘా లేకపోవడంతో వీరు పటమట ప్రాంతానికి వెళ్లి నేరాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది.. స్టేషన్లో తన సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 16వ తేదీ రాత్రి డొంకరోడ్డుకు చెందిన షేక్ రఫీ హత్యనూ పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొన్నట్లు సమాచారం.
YSRCP leader suspended: బహిరంగ విమర్శలు.. వైసీపీ లీడర్ సస్పెన్షన్.. మరో నేతకు షోకాజ్ నోటీసు
ఈ హత్య రాత్రి జరగ్గా అదే రోజు సాయంత్రమే నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపకుండానే విడిచిపెట్టడం, తర్వాత గంటల వ్యవధిలోనే వదిలేసినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు రఫీ హత్య కేసులో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే హత్యని నివారించగలిగే అవ కాశం ఉండేదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ రామారావు సైతం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపైనా సత్వరం స్పందించకపోవడం, రఫీని హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో బాధ్యతగా వ్యవహరించలేదనే కారణంలో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ ఇరువురి సస్పెండ్‌పై పోలీసు అధికారులు పెదవి విప్పడం లేదు. కాగా కానూరు ట్రస్ట్ భూముల వ్యవహారంలోనూ పెనమలూరు పోలీసుల పాత్ర వివాదంగా మారింది.
Three Policemen Suspended: గంజాయి బస్తా మిస్.. ముగ్గురు పోలీసులపై వేటు
నాలుగు నెలల్లో ఇద్దరు సీఐలు సస్పెండ్ : పెనమలూరు పోలీస్ స్టేషన్లో నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు సీఐలు వరుసగా సస్పెండ్ అయ్యారు. ఇక్కడ పని చేసిన గోవిందరాజులు పోరంకిలోని ఓ బడాబాబు ఇంట్లో పని చేసే బాలిక ఆత్మహత్య కేసులో సస్పెండయ్యారు. ఈ కేసులో మృతురాలి తల్లి ముందు ఇచ్చిన ఫిర్యాదును మార్చి బలవంతంగా మరో ఫిర్యాదును తీసుకొన్నారనే ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా సీఐ కిషోర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రామారావు సస్పెండ్ కావడం పోలీస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.