ఖరీఫ్ సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికీ రబీ ధాన్యం అమ్మలేక అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో అధికారులు కొనుగోళ్లపై ప్రతివారం సమీక్షలు పెట్టడంతోపాటు మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. రైతుభరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేక అయినకాడికి అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.
అన్ని ప్రాంతాల్లోనూ అదే సమస్య
జిల్లావ్యాప్తంగా రబీలో 80 వేల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. సాగు ప్రారంభం నుంచి అనేక అవస్థలు పడుతూ పంటను రక్షించుకుంటూ వచ్చారు. ఆశించిన మేర దిగుబడులు వచ్చినా కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాగైన వరిలో 60 శాతం ఎంటీయు-1121 రకం విత్తనాలు సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎంటీయు-1153, ఎంటీయు-1156 తదితర విత్తనాలు సాగు చేశారు. ఇవన్నీ ప్రభుత్వం సిఫారసు చేసినవే. అయినా వివిధ కారణాలతో కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరతో రైతుభరోసా కేంద్రాల ద్వారా కొంటామని చెబుతున్నా ఫలితమివ్వడంలేదు. వరి కోతల ప్రారంభ దశలో తేమశాతం నిబంధనలు చెప్పి కొనలేదు. చేసేదిలేక బస్తా రూ.1000 చొప్పున అమ్మి నష్టపోయారు. ప్రస్తుతం ఆరబెట్టి ధాన్యం నమూనాలను తీసుకొని కేంద్రాలకు వెళ్తే బియ్యం నూకవుతుందని.. మిల్లర్లు తీసుకోనంటున్నారని సిబ్బంది చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతమైన గంపలగూడెం వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య. ధాన్యం ఎలా విక్రయించుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కష్టాలివిగో..
వాతావరణ మార్పులతో వర్షాలు కురవడంతో పొలంలో ఉన్న ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియక అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. పరదాలు కప్పి కాపాడుకుంటున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనకపోవడంతో వ్యాపారులు అడిగిన ధరకే అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. పలు గ్రామాల్లో ధాన్యం విక్రయించే రైతులు వివరాలు నమోదు చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాల్లో సాగు చేసిన పంట వివరాలు నమోదు చేయాల్సి ఉండగా, వారు చేయకపోవడంతో కొన్నిచోట్ల సహకార సంఘాలు చేస్తున్నాయి.
ఏ గ్రేడ్ ధాన్యం 75 కిలోలు రూ.1416కు కొనాలి
ప్రైవేటులో ఎక్కడ చూసినా రూ.1000, రూ.1200కు మించి ఎక్కడా కొనడంలేదు. ధాన్యం నూక అవుతున్న కారణంగా మిల్లర్లు వెనకంజ వేస్తున్నారు. కొంత రాయితీ కల్పిస్తే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయగలమని మిల్లర్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యం నిల్వలు పరిశీలించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పరదాలు కప్పి ఉంచాం
బంటుమిల్లి మండలం జయపురం గ్రామంలో ఏడెకరాల ధాన్యం పరదాలు కప్పి ఉంది. వర్షం పడితే చాలు పాడైపోతుందేమోనని భయపడాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రం చుట్టూ రెండు వారాలుగా తిరుగుతున్నాం. ఇంతవరకు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. మా పక్క రైతు ఓ వ్యాపారికి బస్తా రూ.1150 చొప్పున విక్రయించారు. మేం కూడా ఇక కేంద్రాల చుట్టూ తిరగలేక ఆ ధరకు విక్రయిద్దామని నిర్ణయించుకున్నాం. వర్షం పడితే అంతకు కూడా కొనరేమో అన్న భయంతో చాలామంది అయినకాడికి అమ్మేస్తున్నారు. - కోట శ్రీనివాసరావు, గంపలగూడెం
ఆరబెట్టి బస్తా రూ.1200కు ఇచ్చా
యంత్రంతో కోసిన సమయంలో తడి, పొడి ధాన్యం అని రూ.1000 అడిగారు. ఆ ధరకు అమ్మలేక ఆరబెట్టి నిల్వ ఉంచితే కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. రైతుభరోసా కేంద్రాలకు వెళ్లినా ప్రయోజనం లేక చాలామంది వ్యాపారులకే విక్రయించారు. నేను కూడా చేసిది లేక బయట వాతావరణం బాగోలేక ఇటీవల ఆరబెట్టి బస్తా రూ.1200కు ఇచ్చేసా. ఇంకా డబ్బులు రావాల్సి ఉంది. - విన్నకోట సాంబయ్య, మల్లవోలు, గూడూరు మండలం
తీసుకెళ్తేచాలు
చినుకులు పడితే గుండె ఆగినంత పని అవుతుంది. ధర ఎంతో కొంత ఇవ్వండి.. ముందు ధాన్యాన్ని కల్లం నుంచి తీసుకెళ్లండి అని వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్రాలు ఉన్నాయన్న మాటే.. అవి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలిసిందే. అందుకే వ్యాపారులకు ఏదో ఒక ధరకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. -వీరరాఘవులు, పెందుర్రు, బంటుమిల్లి మండలం
కంట్రోల్ రూంలు ఏర్పాటు
మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరతో ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. అంతకు తక్కువ అడిగితే రైతులు స్థానిక తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్తే వెంటనే సమస్య పరిష్కరిస్తారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. -రాజ్యలక్ష్మి, పౌరసరఫరాలశాఖ డీఎం
ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'