కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోలుకు జిల్లాలో 267 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్ కె.మాధవీలత వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కల్పించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారని తెలిపారు. మిగిలిన ఖరీఫ్ ధాన్యంతో పాటు రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. సహకార సొసైటీల ద్వారా 229 కేంద్రాలను, డీసీఎంఎస్ ద్వారా 23 కేంద్రాలు, ప్రభుత్వం ద్వారా 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ వెల్లడించారు.
ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1815 కనీస మద్దతు ధర ఉందని, ఏ గ్రేడ్ రకానికి రూ.1835 ప్రకటించారని అధికారులు తెలిపారు. "ఏడాది ప్రారంభంలో జిల్లాలో 95,380 మంది రైతుల నుంచి 7.96లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను ఇప్పటికి రూ.1440.61కోట్లు 94,239 మంది రైతులకు చెల్లింపులు జరిపారు. ఇంకా 1141 మంది రైతులకు రూ.17.98 కోట్లు రావాల్సి ఉంది. వీటిని త్వరలోనే అందజేస్తాం" అని డీఎం రాజ్యలక్ష్మి చెప్పారు. ఇంతకుముందు జిల్లాలో పీఏసీఎస్, వెలుగు సంఘాల ద్వారా మొత్తం 269 పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే ధాన్యం సరిగా రానందున కేంద్రాలను ప్రస్తుతం మూసేశారు. జనవరి, ఫిబ్రవరిలో ఖరీఫ్ ముగియగా... ధాన్యం సేకరణ నిలిపి వేశారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.
ఇవీ చదవండి: