కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కాల్ సెంటర్ 1902కు సోమవారం వరకు 16,550 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ఫోర్స్ సభ్యుడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటిల్లో 13,910 ఫిర్యాదులను పరిష్కరించామని.... 2,640 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు.
కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను 40 విభాగాలుగా విభజించి,సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత శాఖకు బదలాయిస్తున్నట్టు వివరించారు. నిత్యావసర వస్తువులు అధిక ధరకు విక్రయంపైనే కాల్ సెంటర్కు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. పరిష్కరించవలసిన 2,640 ఫిర్యాధుల్లో అత్యధికం ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 ఆర్థిక సహాయానికి సంబంధించినవని తెలిపారు.
ప్రధానంగా తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ సాయం అందలేదని కొందరు, తెల్లరేషన్ కార్డు లేనికారణంగా సాయం అందలేదనే వారినుంచి ఎక్కువగా వచ్చాయని అన్నారు. ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా జిల్లా, మండల బృందాలను ప్రభుత్వం ఆదేశించినట్లు కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: 22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్ గ్యాంగ్'