విజయవాడ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. 8 వ నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద రైల్వే ట్రాక్ పై వివస్త్రగా రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లాంటివాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిందా, డబ్బుల కోసం దాడికి తెగబడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పట్టాలపై.. ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న బాధితురాలని చికిత్స నిమితం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అదుపులో అనుమానితులు
వృద్ధురాలిపై దాడి ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. డబ్బుల కోసం ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని వెల్లడించారు. ఘటనకు సంబంధించి పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని స్పష్టం చేశారు.