కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఖరీఫ్ కాలంలో నాణ్యమైన సన్న రకాలు రైతులు సాగు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడులు తగ్గిపోయాయి. ఈ తరుణంలో ధరలూ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. బస్తా నిండా ధాన్యం నింపినా 60 కేజీలు రావటం లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గింజలో నాణ్యత లేదని సాకు చెబుతూ... ప్రైవేటు వ్యాపారులు ధరలు తగ్గించి అడుగుతున్నారు.
సాధారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తా రూ.1416 రూపాయలుగా నిర్ణయించగా.. ప్రైవేటు వ్యాపారులు బస్తా వెయ్యి నుంచి 1100 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకార సంఘాలు, మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ.. అక్కడ ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలు కాలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరలకే ధాన్యాన్ని విక్రయించుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: సీఎస్ లేఖపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ