ప్రభుత్వ ఉద్యోగం, ప్రశాంత జీవితం.. ఇవేమీ ఆమె వద్దనుకున్నారు. సమాజ సేవే లక్ష్యంగా భావించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. సేవే మార్గం, ప్రేమే లక్ష్యంగా.. ముందడుగు వేసి ఆదర్శంగా నిలుస్తారు. నగరానికి చెందిన జయశ్రీ 20 ఏళ్లకుపైగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2018లో జయహో సర్వీస్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టారు.
నిత్యం గతుకుల రోడ్డుపై వాహనదారులు పడుతున్న నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె... వాహనదారుల కష్టాలను తగ్గించేందుకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లపై గతుకులను పూడ్చుతూ... స్పీడ్ బ్రేకర్లపై రంగులు అద్దుతున్నారు. తమ సంస్థ ద్వారా నగరంలో ఇప్పటి వరకు 200 కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లకు రంగులు వేసినట్లు తెలిపారు. క్షేమంగా వెళ్లి... క్షేమంగా రండి... అనే నినాదంతో గోడ పత్రికలను తయారు చేశారు. చిన్న చిన్న స్టిక్కర్లను వాహనాలకు అతికిస్తున్నారు.
నిత్యం ఏదో ఒక కూడలిలో నిల్చుని రెడ్ సిగ్నల్ పడగానే స్టిక్కర్లు అతికిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులకు వివరిస్తారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు రోడ్డుపై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలనేదే ఆమె ఆశయం. అవగాహన కార్యక్రమాలతో కొద్దిగా అయినా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: