Nandigama Chinnari acted in Khiladi: నాలుగేళ్లకే ఆ చిన్నారికి సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన "ఖిలాడీ" సినిమాలో హీరో రవితేజ కుమార్తెగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిన్నారి మరెవరో కాదు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శాన్విత. ప్రస్తుతం ఈ చిన్నారికి ఆరేళ్లు.
ఇప్పుడు సుమారు ఏడు సినిమాల్లో నటిస్తోంది. దీంతో బాలిక తల్లిదండ్రులు డాక్టర్లు మందడపు రంగనాధ్, పరిమిళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. రూహిణ్య పెద్ద కుమార్తె, చిన్నమ్మాయి శాన్విత. వీరివురు చిన్నతనం నుంచే ఎంతో చలాకీగా ఉండేవారిని చెబుతున్నారు. శాన్విత విజయవాడ పోరంకిలోని ఓ పాఠశాలలో చదువుతోంది.
ఫంక్షన్‌లో దిగిన ఫొటోలతో అవకాశాలు..
హైదరాబాద్‌లో బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్‌కు వెళ్లిన శాన్విత అక్కడ కొన్ని ఫొటోలు దిగింది. వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టగా.. వాటిని చూసిన సినీ దర్శకుడు యోగి, తన స్నేహితుడు సురేష్‌కు ఫొటోలను పరిచయం చేయగా.. నాలుగున్నరేళ్లకే తొలి సినిమా అవకాశం వచ్చింది. అనంతరం శ్రీకారం, ఖిలాడీ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కిన్నెరసాని, జెట్టి, సిగ్ధ లోకం ఎలా ఉంది నాయనా, సలార్, గాలీవాన చిత్రాల్లో నటిస్తోంది. దర్శకుడు పెన్నట్టి రమేష్‌వర్మ తీసిన ఖిలాడీ చిత్రంలో గ్లిజరిన్ వాడకుండా కన్నీరు తెచ్చుకుని చక్కగా నటించింది. పెద్దయ్యాక వ్యోమగామినవుతానని, లాలీపప్, ఖాజుభర్పీ, నాన్న రంగనాథ్ అంటే బాగా ఇష్టమని చిన్నారి చెబుతోంది. షూటింగ్‌లో హీరో రవితేజతో బాగా ఆడుకుంటూ నటించానని అంటోంది.
ఇదీ చదవండి: ఆమే నాకు స్ఫూర్తి.. అలా ఎదగాలనేదే నా కల: ఆలియా భట్