Munugode bypoll: తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. పార్టీలకు సాధారణంగా తమకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంటుంది. అయితే తటస్థ ఓటర్లు ఎటువైపు మొగ్గితే వారే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. అందుకే వారిని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే బృందాల క్షేత్రస్థాయి అధ్యయనాన్ని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో.. తటస్థ ఓటర్ల సంఖ్య తక్కువని తేలింది.
గెలుపోటములపై ప్రభావం: దీంతో చౌటుప్పల్, చండూరు పురపాలికలపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి ఓ ప్రధాన పార్టీ చేసిన సర్వే ప్రకారం చౌటుప్పల్ పురపాలికలో మొత్తం 23,908 ఓట్లు ఉండగా.. 4867 మంది తటస్థ ఓటర్లున్నట్లు గుర్తించారు. చండూరు పురపాలికలో 10,726 మంది ఓటర్లుండగా 2369 మంది తటస్థులుగా తేలింది. రెండు పురపాలికల్లోనే 7236 మంది ఉండగా వారిలో సగం ఓట్లుపడినా గెలుపోటములపై ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు.
ఎవరు ఏ పార్టీ వారో తెలియడం లేదు: స్థానికులతో కాకుండా బయటి వారితో సర్వే చేయిస్తుండటంతో వారికి ఎవరు ఏ పార్టీ వారో తెలియడం లేదు. వారితో ఒక స్థానిక నేతను సర్వేకు పంపించడంతో ఓటర్లకు ఏ పార్టీతో అనుబంధం ఉందో వారు సర్వే బృందాలకు వివరిస్తున్నారు. ఉప ఎన్నిక వేళ పార్టీల ఖర్చులతో పాటు పందెల్లోనూ వందల కోట్లు చేతులు మారుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు గుర్రంపై... బెట్టింగ్‌లు పెద్ద మొత్తంలో సాగుతున్నట్లు తెలుస్తోంది.
జోరుగా బెట్టింగ్‌లు: మధ్యవర్తుల వద్ద సొమ్ము ఉంచుతూ రూపాయికి రూపాయి లెక్కన ప్రస్తుతం బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో ఆ బెట్టింగ్ రూపాయికి, 5 రూపాయిల చొప్పున సాగినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. బెట్టింగ్‌ల కోసం పలువురు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు చెందినవారు.. పందెంలు కాస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు క్రికెట్ బుకీలు ఉప ఎన్నిక కోసం పందెంలు కాస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: