కొండపల్లి మైనింగ్‌పై తెదేపా నేత పట్టాభి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అబద్ధాలను నిజం చేయాలని తెదేపా నేతలు ప్రయత్నించటం దారుణమన్నారు. వైఎస్ హయాంలో లోయ గ్రామంలో 143 సర్వే నెంబర్‌ను సృష్టించారని పట్టాభి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 1993 లోనే ఓ వ్యక్తి 143 సర్వే నెంబర్లో మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని గుర్తు చేశారు. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉందన్నారు. 143 సర్వే నెంబర్ ఎప్పటినుంచో ఉందనటానికి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 45 ఏళ్లుగా లోయ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని..అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. లోయలో గత ప్రభుత్వంలో ఇచ్చిన విచారణ నివేదికల ప్రకారమే మైనింగ్ అనుమతులు ఇచ్చారన్నారు.
చూస్తూ ఊరుకోబోం..
తనపై బురద జల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా ఏడాదిన్నరగా పని చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తున్నట్లైతే..ఆధారాలతో బయటపెట్టాలన్నారు. స్పిన్నింగ్ మిల్లులకు ఆర్థికసాయం చేయిస్తామని గత ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈల నుంచి ఇద్దరు మంత్రులు రూ. 9 కోట్లు తీసుకుని మోసం చేశారని కృష్ణప్రసాద్ ఆరోపించారు. తెదేపా నేతలు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని..,త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశారన్నారు. అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్ వివాదం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం జి.కొండూరు మండలాల పరిధిలో అటవీ ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిగాయి. కొండలను తొలిచి కంకర, గ్రావెల్ తరలించిన వైనం గతేడాది ఆగస్టులో వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు 8 జేసీబీలు, 7 టిప్పర్లను స్వాధీనపరుచుకుని, ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. జి.కొండూరు మండలంలో కడెంపోతవరం, లోయ గ్రామాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ఉన్న గ్రావెల్, కంకర తవ్వేశారు. కడెంపోతవరం గ్రామంలో సర్వే నంబరు 143 సృష్టించి లీజులిచ్చారు. మరో సర్వే నంబరు 26/1లో 280 ఎకరాలు ఉంది. వర్గీకరణ ప్రకారం ఇది అడవిగా ఉన్నా రెవెన్యూ శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసింది.
లీజులు రద్దు చేసినా..మళ్లీ తవ్వకాలు
గతంలో ఇక్కడ లీజులు ఇస్తే జిల్లా సంయుక్త కలెక్టర్ రద్దు చేశారు. నాటి నుంచి గనుల శాఖ అనుమతులు ఇవ్వలేదు. గతేడాది మళ్లీ తవ్వకాలు జోరందుకున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలివేశారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాదిగా కనీసం రూ.100 కోట్లకు పైగా విలువైన కంకర, గ్రావెల్ తరలించినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ సబ్‌కలెక్టర్, ఫారెస్ట్ రేంజి అధికారి, గనులశాఖ ఏడీలతో కూడిన త్రిసభ్య కమిటీ దీన్ని అభయారణ్యంగా గుర్తించింది. దీంతో 2020 ఆగస్టు 24న అప్పటి కలెక్టర్.. అక్రమ తవ్వకాలపై లెక్కలు తీయాలని, ఎంత తవ్వకాలు జరిపారో సర్వే ద్వారా గణించాలని గనులు, అటవీ శాఖలను ఆదేశించారు.
ఇదీ చదవండి
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు