ఆక్వా, మత్స్య అనుబంధ రంగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అథారిటీని త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో మత్స్య ఉత్పత్తిదారులు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. దేశంలోనే ఆక్వా ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంలో ఈ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు.
చేపలు, రొయ్య పిల్లల నుంచి ఉత్పత్తులకు ధర... మార్కెటింగ్... విక్రయాల వరకు అన్నింటిపైనా దృష్టి సారిస్తుందన్నారు. ఈ-మార్కెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా ప్రభావం వల్ల మన రాష్ట్రం నుంచి చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు తగ్గాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు 250 లారీలు ప్రతిరోజు ఇక్కడి నుంచి వెళ్తే- ప్రస్తుతం 50 లారీల సరకు కూడా వెళ్లడం కష్టంగా ఉందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మార్కెట్‌లు తెరుచుకుని కొనుగోళ్లు మొదలైతే తప్ప పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా లేవన్నారు.
ఇదీచూడండి. మా నీటినే.. మేం వాడుకుంటాం: సీఎం జగన్