రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు, డీజీపీకి ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉందని.. చంద్రబాబు, భాజపాలాంటి వారి బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. దేవాలయాలపై జరిగిన దాడుల్లో చంద్రబాబు సహా ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దన్నారు. అంతకు ముందు గొల్లపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీలో కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాజీ మంత్రి దేవినేని తన చేతిలోనో, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ చేతిలోనో దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. ‘ఈ రోజు మైలవరం నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడైనా వస్తా. మీ చంద్రబాబు ఏం చేశారో? మా జగన్ ఏం చేశారో చెబుతా. మీ ఇంట్లో అయినా సరే చర్చకు నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తానన్నారు. లేకపోతే తన పేరు కొడాలి నాని కాదన్నారు.
ఇదీ చదవండి