ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు ఇంకా తెలియలేదు: మంత్రి ఆళ్ల నాని - ఏలూరు ఘటనపై మంత్రి ఆళ్ల నాని స్పందన
ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు ఇంకా తెలియలేదని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు అన్ని వైద్య పరీక్షలు చేశామని.. ఎలాంటి వ్యాధి నిర్ధరణ కాలేదని చెప్పారు. కొవిడ్ టెస్టులు చేశారని.. అందులోనూ నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 227 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అస్వస్థతపై కారణాలు ఇంకా నిర్ధరణ కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారితో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, వైద్యవిధాన పరిషత్ డీసీహెచ్ఎస్ మోహన్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
మంత్రి నాని మాట్లాడుతూ.. రాత్రి నుంచి బాధితులకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి వ్యాధి నిర్ధరణ కాలేదని అన్నారు. వైరల్, బ్యాక్టీరియా వంటి పరీక్షలు నెగెటివ్ వచ్చాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరుతున్న ఆందరీకి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారని.. అవీ నెగెటివ్‌గానే తేలాయన్నారు. నగరంలో 22 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షించామని.. ఎలాంటి కలుషిత లక్షణాలు కనిపించలేదని అన్నారు. ప్రస్తుతం 227 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నందున.. విజయవాడ తరలించామని వెల్లడించారు. మిగతావారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. కొందరు భయంతో ఆసుపత్రికి వస్తున్నారని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి..