Non Veg lovers increased in telangana : తెలంగాణ రాష్ట్రంలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగింది. వారానికి 2 లేదా 3 సార్లయినా ముక్కతో భోజనం చేస్తేనే మజా అనేలా రాష్ట్రంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. గొర్రె, మేక మాంసానికి డిమాండు పెరుగుతుండటంతో కిలో మాంసం ధర రూ.800 నుంచి రూ.1080కి ఎగబాకింది. దేశంలో అత్యధికంగా మాంసాహారం తినే ప్రజలున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగాయి. దీనిని కిలోకు సగటున రూ.600గా లెక్కవేస్తే అక్షరాలా రూ.58,500 కోట్లు వెచ్చించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో గొర్రెల, మేక మాంసం ప్రస్తుతం ఆరేడు వందల రూపాయలకు లభిస్తుంటే.. తెలంగాణ రిటైల్ మార్కెట్లలో రూ.1000 వరకు విక్రయిస్తున్నట్లు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.
Meat consumption increased in Telangana : ఇప్పటికే కోటీ 90 లక్షలకు పైగా గొర్రెల సంఖ్యతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానానికి చేరింది. మాంసానికి పెరుగుతున్న విపరీతమైన డిమాండు కారణంగా నిత్యం 80 నుంచి 100 లారీల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు వస్తున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో గొర్రెల పెంపకం, వాటి విక్రయాలు, మాంసానికి పెరుగుతున్న డిమాండుపై తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యయనం చేసింది. మాంసానికి పెరుగుతున్న డిమాండు, గొర్రెల పెంపకానికున్న ప్రాధాన్యంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేసింది.
ముఖ్యాంశాలు..
* తెలంగాణలో 2015-16లో గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులు. కాగా.. 2020-21కల్లా అది 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది 3.50 లక్షల టన్నులకు పైగా విక్రయాలుంటాయని... దీనికోసం రూ.31 వేల కోట్లకు పైగా ప్రజలు వెచ్చిస్తారని అంచనా. వచ్చే ఏడాది ఆఖరుకల్లా ఈ మాంసం మార్కెట్ విలువ రూ.35 వేల కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
* మనదేశంలో గొర్రె, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం కేవలం 5.4 కిలోలైతే తెలంగాణలో అత్యధికంగా 21.17 కిలోలకు చేరింది.
* గొర్రెల పంపిణీపథకం వల్ల కొత్తగా రూ.7920 కోట్ల సంపదను సృష్టించినట్లు సమాఖ్య స్పష్టం చేసింది.
* ఇతర రాష్ట్రాల నుంచి కొని తెచ్చి 82.74 లక్షల గొర్రెలను గొల్ల, కురుమలకు పంపిణీ చేయగా వీటికి 1.32కోట్ల పిల్లలు జన్మించాయి. వీటిద్వారా ఏటా లక్షా 11వేల టన్నులమాంసం ఉత్పత్తి అదనంగాపెరిగింది.
* ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన మాంసం వ్యాపారులు ఆదివారం సంతల్లో ఇక్కడి నుంచి గొర్రెలు, మేకలను కొని తీసుకెళుతున్నారు.
* రెండో విడతలో 3.50 లక్షల మంది గొల్ల, కురుమలకు 73.50 లక్షల గొర్రెలను రూ.6125 కోట్ల వ్యయంతో పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదించిందని సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు ‘ఈనాడు’కు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మాంసం విక్రయించేందుకు సమాఖ్య ఆధ్వర్యంలో నేరుగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి..