ప్రస్తుత వాతావరణం మామిడి రైతులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు మామిడి తోటలు ఎక్కువగా సాగు చేస్తోన్న ప్రాంతాల్లో తోటబడి పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మామిడిపై సోకే పురుగులు, తెగుళ్లను ప్రారంభంలోనే అరికడితే..ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సస్యరక్షణపై నూజివీడు మామిడి పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు తగిన సలహాలు ఇస్తున్నారు.
కృష్ణాజిల్లాలో మామిడి కాపు ముందుగా రెడ్డిగూడెం మండలం నుంచే ఆరంభమవుతుంది. అక్కడ తోటబడి కార్యక్రమాన్ని నిర్వహించి..., పురుగు నివారణ, తెగుళ్లను పరిశీలించి మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక రైతు నుంచి మరో రైతుకు సస్య రక్షణ విధానాలు తెలియజేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తున్నారు.మామిడి తోటలను ఎప్పటికప్పుడు పరిశీలించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే.., అనవసరపు ఖర్చులు తగ్గించటంతో పాటు, అధిక దిగుబడి పొందవచ్చని అధికారులు తెలిపారు. గత రెండేళ్ల నుంచి మామిడికి కవర్లు కట్టే విధానాన్ని రైతులు అనుసరిస్తున్నారు. దీనివల్ల కాయల నాణ్యత బాగుండడంతోపాటు ధర కూడా ఆశాజనకంగా ఉంటుందని రైతులు తెలిపారు.
కవర్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న ఉద్యానశాఖ అధికారులు..,ఇతర మార్గాలను వివరిస్తున్నారు. కార్బైడ్ ద్వారా మాగబెట్టిన మామిడి అమ్మకాలను తినటం వల్ల ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. సహజ పద్ధతి లేదా ఇథలీన్ ద్వారా మాగబెట్టిన పండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేలా రైతులకు శిక్షణనిస్తున్నారు. మామిడితో పాటు అరటి తదితర పండ్లను మాగబెట్టేందుకు రైఫైనింగ్ ఛాంబర్ల ఏర్పాటుకు రాయితీ ఇస్తోన్న విషయాన్ని ఈ సదస్సుల్లో వివరిస్తున్నారు.
ఇదీచదవండి