రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతింటి కల నెరవేర్చడంలో వైకాపా ప్రభుత్వం విజయవంతమైందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. పెనమలూరు మండలంలోని లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి.. వణుకూరులో లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేశారు. ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. ప్రతి ఒక్క పేదవాడికీ ఇల్లు నిర్మిస్తామన్నారు. ఆ హామీ నెరవేర్చిన రోజు పండుగలా ఉందని పేర్కొన్నారు. అప్పట్లో వైఎస్సార్ రూపాయికి వైద్యం అందిస్తే.. తండ్రికి తగ్గ తనయుడిలా ముఖ్యమంత్రి జగన్ రూపాయికే స్థలం రిజిస్ట్రేషన్ చేస్తున్నాడన్నారు. ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ.. నీచ బుద్ధిని బహిర్గతం చేస్తున్నాయని ఎంపీ విమర్శించారు. ఇప్పటికైనా అభివృద్ధిని అడ్డుకోవడం మానేసి.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం వైకాపా వల్లే సాధ్యమైందని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. 1,400 మందికి పట్టాలు అందజేయగా.. విడతల వారీగా అన్ని గ్రామాల్లోనూ పేదలకు స్థలాలు ఇస్తామన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి నిరూపించుకున్నారని వివరించారు.
ఇదీ చదవండి: