వ్యాపార రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న సమీర్ మీర్జా ఇప్పటివరకు దాదాపు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు హైదరాబాద్ గచ్చిబౌలి సీఐ సురేశ్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే మీర్జా ఖాదర్ అలియాస్ సమీర్ మీర్జా మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్ పేరుతో గచ్చిబౌలిలోని ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. అనంతరం 30 మంది సిబ్బందిని నియమించుకుని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా చలామణి అవుతున్నాడని పేర్కొన్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పిస్తూ.. నమ్మిన వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇప్పిస్తానంటూ ప్రాసెసింగ్ రుసుం పేరిట డబ్బు వసూలు చేస్తాడని వివరించారు.
ప్రాసెసింగ్ ఫీజు పేరిట మోసం
ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మోహన్ రావు గత డిసెంబర్‌లో మీర్జా ఖాదర్‌ని కలిసి వ్యాపార విస్తరణకు దాదాపు రూ.300 కోట్ల రుణం కావాలని కోరినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని రుణంగా ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ. 2.18 కోట్లు వసూలు చేశాడని వెల్లడించారు.
గతంలోనూ మోసాలు
మోహన్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సమీర్ మీర్జా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని సీఐ తెలిపారు. నిందితుడు సమీర్ మీర్జా గతంలోనూ పలు రకాల మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కేసు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు.