దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు సంఘీభావంగా విజయవాడలో వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ సంస్థల మేలు కోసమే తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఆందోళనలు చేస్తున్న రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. డిసెంబరు 26న దిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతామని వెల్లడించారు.
అన్నిపార్టీలు కేంద్రాన్ని నిలదీయాలి..
కేవలం ఐదుగురి కోసమే మోదీ కొత్త విధానాలను అమలు చేస్తున్నారని సీపీఎం నేత మధు అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులకేగాక వినియోగదారులపై కూడా భారం పడనుందని తెలిపారు. వైకాపా, తెదేపా, జనసేనలు కేంద్రాన్ని నిలదీయాలని కోరారు.
ఇదీ చదవండి: ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగుల యత్నం