పేరుకే అది ప్రభుత్వ ఇసుక డిపో. కంప్యూటర్ ఉన్నా పుస్తకాల్లోనే లెక్కలు. సీసీ కెమెరాలు ఉన్నా పని చేయవు. ఎందుకంటే విద్యుత్ సరఫరా లేదు అనే జవాబు. ఇదీ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఇసుక డిపో వద్ద పరిస్థితి.
సీసీ కెమెరాలు, కంప్యూటర్లే కాదు... ఇసుక ఎంత తరలిపోతుందో తెలియటానికి ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ఎందుకూ పనికి రాకుండా ఉంది. ఫలితంగా డిపో నుంచి ఇసుక ఎంత పోతుందో తెలియని పరిస్థితి. వే బ్రిడ్జి లేక 18 టన్నులకు మించిన లోడ్‌తో ఇసుక లారీలు దూసుకుపోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. స్టాక్ యార్డ్ అని పేరేగాని ట్రాక్టర్లు నేరుగా నదిలోకి వెళ్లి లోడ్ చేసుకొని పోతున్నా... సంబంధిత అధికారులకు మాత్రం కనపించటం లేదనే విమర్శలున్నాయి.
10 చక్రాల లారీకి 9 టన్నుల చొప్పున 2 బిల్లులకు మాత్రమే అనుమతి ఉంది. వాటికి పదిసార్లు మాత్రమే ప్రొక్లేయిన్తో ఇసుకను వేయాలి. కానీ ప్రస్తుతం 15 సార్లు ప్రొక్లేయిన్తో ఇసుక వేస్తున్నారు. లోడింగ్ జరిగిన ప్రతిసారీ ఆన్లైన్లో నమోదు చేయాలి. అధికారులు ఏ విధంగా నమోదు చేస్తున్నారో వారికే తెలియాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: దొంగతనానికి కాదేది అనర్హం... పందులు మాయం..!