ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద 7.03 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అధికారులను, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.
వరద ఉద్ధృతి వల్ల ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీటమునిగాయి. పెద్దపులిపాక, చోడవరం, మద్దూరులో ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరదలతో అరటి, కంద పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద కారణంగా ఏటిపట్టు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాజ్వేపై నడుము లోతు నీటిలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. మూలపాడు పాడు ఎస్సీ కాలనీలో ఇళ్లు నీట మునగటంతో రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన భూపేశ్గుప్తానగర్, రామలింగేశ్వరనగర్, తారకరామనగర్లోకి వరద నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. దుగ్గిరాల మండలంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మినప, కంద, పసుపు పంటలతో పాటు కూరగాయ తోటల్లోకి వరదనీరు చేరింది. రోడ్లపైకి కూడా నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం మొత్తం జలదిగ్బంధమయ్యాయి.
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తోట్లవల్లూరు మండల పరిధిలోని 8 లంక గ్రామాల ప్రజల కోసం 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తోడేళ్ళుదిబ్బ, పాములలంక, పొట్టిదిబ్బ లంక, పిల్లివాని లంక, తుమ్మలపిచ్చి లంక గ్రామాల్లో వరద నీరు చేరుతోంది. పలుచోట్ల పసుపు ,కంద ,చెరకు ,తమలపాకు పంటలు నీటిలో నానుతున్నాయి. వల్లూరుపాలెంలో పొలంలో చిక్కుకున్న దంపతులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
మోపిదేవి మండలాన్ని పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. మండలంలోని కోసురువారిపాలెం, పోసిగాని లంకలోని కరకట్ట వైపు నుంచి పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో పంట మొత్తం నీటిలోనే నానుతుంది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు విద్యుత్ మోటార్లు కరకట్ట పైకి చేర్చుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు అంతా జలమయం అయ్యాయి.
ఇదీ చదవండి: