కృష్ణా జిల్లా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన సీపీఎం నేతలు కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో బాధితులను కలిశారు. ఆ ప్రాంతంల రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5 లోపు నిర్దిష్ట చర్యలు చేపట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఏటా కృష్ణా నదికి వరదలు వచ్చి విజయవాడలో సుమారు 10 వేలకుపైగా ఇళ్లు, దాదాపు 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే రిటైనింగ్ వాల్..
వరదల నుంచి కాపాడటానికి రిటైనింగ్ వాల్ నిర్మించి, శాశ్వతంగా ప్రజలకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మూడోవంతు గోడ మాత్రమే నిర్మించిందని.. 16 నెలల వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప గోడ నిర్మాణ పనులు ప్రారంభించలేదని అన్నారు.
'ఆర్థిక సాయమేదీ?'
గత వరద బాధితులకు ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందించలేదని వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్ సర్కార్ కనీస సహాయం చేయట్లేదని మండిపడ్డారు.