కృష్ణాజిల్లాలో పారిశుధ్య కార్మికుల తీరుతో ప్రభుత్వరంగ బ్యాంకులు మురికి కుప్పలుగా మారాయి. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో..పురపాలక సిబ్బంది ఈ పనిచేశారు. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ బ్యాంకుల ముందు పురపాలక వాహనాల్లో చెత్త తీసుకొచ్చి వేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన జగనన్న తోడు- జగనన్న చేయూత, పీఎం స్వనిధి, వైఎస్‌ఆర్ చేయూత పథకాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ.. ఈ తరహా పనికి పూనుకున్నారు. విజయవాడలో యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంతో పాటు.. మరో రెండు చోట్ల, ఉయ్యూరులో కార్పోరేషన్ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కెనరాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖల వద్ద చెత్త వేశారు. మచిలీపట్నంలో ఒక చోట..బ్యాంకుల వద్ద చెత్త పారబోయించారు. సాక్షాత్తు నగర, పురపాలక, నగర పంచాయతీ పారిశుధ్య సిబ్బందే ఈ చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరులో సంబంధిత బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తుండటం వల్లే ఈ పని చేస్తున్నట్లు బ్యాంకు ద్వారాల వద్ద నోటీసు అంటించారు
- అధికారుల ఆదేశాలతోనే
తాము మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకే ఈ విధంగా చేశామని బ్యాంకు ప్రతినిధులతో అక్కడి పారిశుధ్య సిబ్బంది పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించిన బ్యాంకులపై ఈ తరహా పోరాటానికి దిగాలని ఉన్నతాధికారులు ఆదేంచినట్లు చెబుతున్నారు. ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వకపోగా సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదనేది ఉయ్యూరు నగర పంచాయతీ అధికారుల మాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలైన జగనన్న తోడు- జగనన్న చేయూత, పీఎం స్వనిధి, వైఎస్‌ఆర్ చేయూత తదితర పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు వాణిజ్య బ్యాంకుల నుంచి సరైన రీతిలో రుణాలు అందడం లేదని భావిస్తోన్న అధికార యంత్రాంగం వారిపై వివిధ రూపాల్లో ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు ఈ తరహా చర్యలకు పాల్పడడాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
జగనన్న తోడు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదనే ఆరోపణలతో ... మునిసిపల్ అధికారులు చెత్తను బ్యాంకు శాఖల ముందు పారబోయడం తీవ్ర ఆక్షేపణీయం. అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయా.. అనిపిస్తోంది. ప్రభుత్వ సిబ్బందే ఇలా చేయడం దురదుష్టకరం. కలెక్టర్ ఆదేశాలతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. అది అత్యంత బాధాకరం. యూనియన్ బ్యాంక్ ప్రభుత్వ పథకాలకు 128శాతం పైబడి సంక్షేమ పథకాలకు రుణాలు ఇచ్చారు. అయినా ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిబంధనల ప్రకారమే బ్యాంకులు రుణాలిస్తాయి. అయినా ఇలా చేయడం అమానుషం - బి.సీతారాంబాబు, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి
- ఇక ముందు జరగదు..
బ్యాంకుల ముందు చెత్త వేయటం దురదృష్టకరమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయట్లేదని కొంతమంది పారిశుద్ధ్య సిబ్బంది బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి చెత్తను తీసివేయించామని వెల్లడించారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు . ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...
శభాష్ పోలీస్: సొమ్మసిల్లిన మహిళను 6 కిలోమీటర్ల మోసుకెళ్లి కాపాడాడు!