Krishna District Lorry Owners Association Demand : సరకు రవాణా వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం త్రైమాసిక పన్నులను వెంటనే తగ్గించాలని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో అవసరమైతే బంద్ చేయడం సహా ఏపీలో రిజిస్ట్రేషన్ చేసిన లారీలను పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని సంఘం అధ్యక్షుడు తుమ్మల లక్మణ స్వామి హెచ్చరించారు. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, నష్టాలతో లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ పరిస్ధితుల్లో సరకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంచడం సరైంది కాదన్నారు. పన్నులు పెంచవద్దని మంత్రికి, ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని, లారీ యజమానులతో కనీసం చర్చించకుండానే పన్నులు ఒకేసారి 30 శాతం వరకు పన్ను పెంచడం చాలా దారుణమని లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
తీవ్రంగా నష్టపోతున్నాం: మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడా లేని రీతిలో డీజిల్ ధరలు పెంచారన్నారు. ఎక్కడా లేనట్లుగా రాష్ట్రంలో 2021 డిసెంబర్లోనే గ్రీన్ టాక్స్‌ను పెంచారన్నారు. లారీల ఫిట్ నెస్ చార్జీలు 920 నుంచి 13500 రూపాయలకు పెంచారని వారు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఇంటర్ స్టేట్ పర్మిట్లు ఇవ్వకపోవడం వల్ల నష్టపోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహా ఏ రోడ్లూ బాగాలేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లారీల అడ్రస్‌లు మార్చుకునే పరిస్థితి : రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పినా పట్టించుకోలేదని, పన్నుల పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీర వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పన్నులు తగ్గించకపోతే మేం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తామని, లారీల అడ్రస్‌లు మార్చుకునే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందన్నారు.
పన్నులు తగ్గించి ఆదుకోవాలి : ఓవర్ లోడ్, ఓవర్ హైట్ జరిమానాలతో ప్రభుత్వం లారీయజమానుల నడ్డి విరుస్తుతోందని, ఫైనాన్స్ కట్టలేక గతంలో లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి ఆదుకోవాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు.
"రవాణా వాహనాలపై పన్నును 22 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. ఇప్పుడు పన్ను మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. కరోనా తరువాత డీజీల్ ధరలు పెరగడం ఇంకా ఒకదానికొకటి తోడై రవాణా రంగాన్ని నష్టపరుస్తున్నాయి."- తుమ్మల లక్మణస్వామి , కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు
"కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి రవాణా రంగం పన్నులు వేసి తీవ్ర సంక్షోభంలోకి తీసుకెళుతున్నాయి. త్రైమాసిక పన్నులను తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాము"- గోపిశెట్టి వీర వెంకయ్య, కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి