కృష్ణా జిల్లా నందిగామ రైతు బజార్‌లో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జయరాం 500 జనపనార సంచులను వితరణ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని.. ఈ మేరకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ జయరామ్ సూచించారు. బరువు ఎక్కువ ఆపుతుందనే ఉద్దేశంతో ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారని.. వాటి వల్ల నష్టమే తప్ప లాభం లేదన్నారు. జూట్ బ్యాగులు, క్లాత్ సంచులను మాత్రమే వాడాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైనా ఉందని, భావితరాల రక్షణ కోసం పర్యావరణాన్ని రక్షించాలని జయరాం కోరారు.
పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు..
పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే నినాదంతో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ప్రతి ఇంటి ఆవరణలో సహా రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచాలని సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్ సూచించారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వాడటం వల్ల ఆ కవరు మట్టిలో గాని నీటిలో గాని వేసినప్పుడు కరిగిపోకుండా ఉంటూ పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుందని వివరించారు.
జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే..
కాబట్టి ప్రతీ ఒక్కరూ జ్యూట్ లేక క్లాత్ కవర్లనే ఉపయోగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం యువత కీలక పాత్ర వహించాలని, ప్రతి పుట్టిన రోజుకి ఓ మొక్కను నాటి దాని పూర్తి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. వర్షాలు సకాలంలో కురవాలన్నా, ఆక్సిజన్ సక్రమంగా అందాలన్న మొక్కలు నాటడం చాలా అవసరమని.. అందరి సహాకారంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని హితవు పలికారు.
ప్రతి ఒక్కరూ అవే వినియోగించాలి..
ప్రతి ఒక్కరూ క్లాత్ లేదా జనపనార సంచులను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కె. శివప్రసాద్ రెడ్డి, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రావిళ్ల అజయ్ కుమార్, మేస్త్రీ గురునాథం తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : YS Sharmila: షర్మిల కొత్త పార్టీకి అధికార ప్రతినిధుల నియామకం