జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లాలోని పొన్నవరంలో నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతులకు జన్మించారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన.. ఆయన 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గానూ, హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో రైల్వేశాఖ స్టాండింగ్ కౌన్సెల్‌గానూ పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడి గానూ జస్టిస్ ఎన్వి రమణ పనిచేశారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2013 సెప్టెంబర్ 2న దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమణ 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఎన్వి రమణ పత్రికల్లో వచ్చే కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరిస్తూ ప్రజాపక్షాన నిలిచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చారిత్రక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ రమణ భాగస్వామ్యులుగా ఉన్నారు.
మంచి పనితీరు కనబరచడం, కేసుల పరిష్కారానికి గడువులు నిర్ణయించడం, సకాలంలో న్యాయమైన తీర్పులు వెలువరించడం, సాంకేతికత సాయంతో శీఘ్ర న్యాయపాలన సాధించడం సమర్థ న్యాయ నిర్వహణకు గీటురాళ్లుగా.. జస్టిస్ ఎన్వి రమణ చెబుతారు. అవసరమే ఆవిష్కరణలకు ఆలంబన అని నమ్మే జస్టిస్ రమణ కొవిడ్ సమయంలో ఈ-లోక్ అదాలత్‌ను తీసుకువచ్చారు. ఈ-వివాద పరిష్కార విధానం ద్వారా కక్షిదారులకు ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుండగా న్యాయవ్యవస్థలపై పెరిగిపోతున్న పని భారాన్ని ఈ-లోక్ అదాలత్‌లు తగ్గిస్తాయని జస్టిస్ రమణ నమ్మకం.
తమను తాము సమర్థించుకునే స్వేచ్ఛ లేకపోవటంతో న్యాయమూర్తులు ఇతరులకు సున్నితమైన లక్ష్యాలుగా మారుతున్నారనేది జస్టిస్ రమణ భావన. జడ్జిలను గొప్ప న్యాయమూర్తులుగా ఎవరూ గుర్తించకపోయినా ఫర్వాలేదు కానీ రాజ్యాంగ ధర్మం తప్పుదోవ పట్టకూడదనేదే ఆయన సిద్ధాంతం. తెలుగువారైన జస్టిస్ రమణ.. ఎంత ఎదిగినా అమ్మభాష కమ్మదనాన్ని మర్చిపోలేదు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని చెబుతుంటారు. తెలుగుభాషను చిన్నచూపు చూడవద్దని చెబుతూ అమ్మభాషను బతికించుకునేందుకు.. మాతృభాషలోనే మాట్లాడాలని, ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలనేది ఆయన అభిమతం.
ఇదీ చదవండి: సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగునేల గర్వించేలా..