అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. ప్రభుత్వం నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రకు అడ్డంకులు సృష్టించడం... ఐకాస నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని మనోహర్ ఖండించారు. జనసేన పార్టీ నిర్భయంగా... ప్రజా సమస్యలపై పోరాడుతుందని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితమన్న ఆయన... అన్ని వర్గాల వారితో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.
ఇవాళ విజయవాడకు పవన్
రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులను విస్మరించడం సరికాదన్నారు. అన్ని అంశాలపై నూటికి నూరు శాతం చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సందేహాలు తీర్చాలన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతలు పర్యటించి ప్రజల సందేహాలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ విజయవాడ రానున్నారని మనోహర్ తెలిపారు. వచ్చే వారం రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశంపై పవన్ చర్చించనున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చర్చించామన్న ఆయన... త్వరలోనే గుంటూరు-విజయవాడల్లో నిరసన కవాతు నిర్వహించనున్నామన్నారు.
ఇదీ చదవండి: