రాష్ట్రంలో రూ.11,549 కోట్లతో పరిశ్రమలు స్థాపించేందుకు 1,400 సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం జగన్ చెప్పారు. మరో 20 ప్రముఖ సంస్థలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే అధికారంలోకి రాగానే ఆదుకున్నామని స్పష్టం చేశారు. అబద్ధాలు, గ్రాఫిక్స్ చూపిస్తుంటే ఎక్కడా న్యాయం జరగదని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బాగున్నామని గత ప్రభుత్వం గొప్పగా చెప్పిందని.. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు.
సుస్థిర ప్రభుత్వం
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు సీఎం జగన్. దేశంలోనే 22 మంది ఎంపీలతో నాలుగో స్థానంలో ఉన్నామన్న ఆయన.. మౌలిక సదుపాయాల పరంగా ఏపీ చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని.. 4 పోర్టులు, 6 ఎయిర్‌పోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఆయన.. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
నిబద్ధత, నిజాయతీ తమ వద్ద ఉన్నాయని సీఎం చెప్పారు. రివర్స్ టెండరింగ్‌తో ఇప్పటికే చాలా వరకు ఆదా చేశామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రం నుంచి ఎగుమతులు అధికంగా ఉన్నాయన్నారు. దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థ ఏపీలో ఉందని స్పష్టం చేశారు.
బకాయిలు పెండింగ్‌లో
గత ప్రభుత్వ హయాంలో చాలా వరకూ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం జగన్.. రూ.4 వేల కోట్ల పెండింగ్ బకాయిల్లో రూ.968 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు చెందినవేనని తెలిపారు. విద్యుత్ డిస్కంలకు రూ.20 వేల కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: