అమరావతి ప్రాంత రైతుల బాధలు వివరిస్తూ... అమరావతి పరిరక్షణ సమితి గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్కు లేఖ రాసింది. రైతుల తరఫున ఎనిమిది పేజీల లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. అమరావతి పరిరక్షణ కోసం 223 రోజులుగా నిరాటంకంగా సాగుతోన్న ఉద్యమ వివరాలు లేఖలో ప్రస్తావించారు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటేనే పార్లమెంట్‌లో తప్పనిసరిగా చర్చిస్తారని.. అలాంటిది పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాజధాని మార్పు చేస్తే దేశంలో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. మూడు ముక్కలాటతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని... అమరావతినే ఏకైక రాజధానిగా గుర్తించాలని కోరారు. ఈ ప్రభుత్వానికి రాజకీయమే ముఖ్య అజెండాగా ఉంది తప్ప ప్రజలు, రాష్ట్రభవిష్యత్తు పట్టటం లేదని పరిరక్షణ సమితి కన్వీనర్ ఎ.శివారెడ్డి, సహ కన్వీనర్లు గద్దె తిరుపతిరావు ఆరోపించారు.
కేసుల పేరుతో రైతులను భయపెడుతున్నారని... రాజధానికి భూములించిన వారంతా రోడ్డున పడ్డారని లేఖలో ప్రస్తావించారు. వాస్తవాంశాలన్నింటినీ పరిశీలించి న్యాయం చేయాలని అమరావతి అన్నదాతల తరఫున విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి