Irregularities in Enrolling of Voters list రాష్ట్రంలో తమ సానుభూతిపరుల ఓటు హక్కును హరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తెలుగుదేశం ఆరోపించింది. ఎంపిక చేసిన ప్రతి నియోజకవర్గంలో 25వేల ఓట్ల వరకూ తొలగించేందుకు... ఫేక్ సిమ్ కార్డు రాకెట్ నడిచిందని ధ్వజమెత్తింది. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను వాడుకుని... అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని... ఆ పార్టీ సీనియర్ నేత ఏలూరి సాంబశివరావు పలు వివరాలను బహిర్గతం చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రతిపక్షాల్నీ ఏకమవుతుంటే... అధికార పార్టీ మాత్రం తమకు వ్యతిరేకమనుకున్న ఓట్లన్నీ గల్లంతు చేసే కుట్రకు తెరతీసింది. రాష్ట్రంలో నాలుగైదు నెలల నుంచి దాదాపు 7 లక్షల 60 వేల పైచిలుకు ఓట్లు తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తు చేస్తే... వాటిల్లో 2 లక్షల 45 వేల దరఖాస్తులు... చంద్రబాబు అరెస్టైన తరువాతే వచ్చాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వివరాలు బయటపెట్టారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేసి వైసీపీ అనుకూల వ్యక్తులకు నాలుగైదు చోట్ల ఓటు హక్కు కల్పించేలా పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తరువాత నమోదైన ఫారం-7 జాబితాలో.... ఇచ్ఛాపురం, రాజాం, బొబ్బిలి, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణ, భీమిలి, చోడవరం, పాయకరావుపేట, పిఠాపురం, దెందులూరు, కొవ్వూరు, గురజాల, వినుకొండ, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, రాయదుర్గం, తంబళ్లపల్లె, తిరుపతి వంటి నియోజకవర్గాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు తరువాత కొత్త ఓట్ల కోసం నమోదైన ఫారం-6 దరఖాస్తుల్లో.... ఇచ్ఛాపురం, బొబ్బిలి, భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణ, గాజువాక, పాడేరు, చోడవరం, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, అరకు, పలాస, నర్సీపట్నం, ఏలూరు, ఉంగుటూరు, నెల్లూరు గ్రామీణం, నెల్లూరు అర్బన్, మడకశిర, చంద్రగిరి, కడప, శ్రీకాళహస్తి, కర్నూలు తదితర నియోజకవర్గాలు ఉన్నాయన్నారు.
పర్చూరు నియోజకవర్గంలో దాదాపు 14వేల ఓట్ల తొలగింపునకు... 189 మంది ఫారం-7 దరఖాస్తు చేశారని... సాంబశివరావు మండిపడ్డారు. వీరి వెనక ఓటీపీలు షేర్ చేసిన వారు 1300 మంది ఉండడంతో పాటు ఓట్ల చేరికలు, తొలగింపుతో సంబంధం లేని పోలీసులు కూడా బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చిన వారిలో ఉన్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలతో హైకోర్టును తాము ఆశ్రయిస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఎల్‌వోల వరకూ కదలిక వచ్చిందన్నారు. హైకోర్టు మొట్టికాయలతో తూతూమంత్రంగా తప్పు చేసిన 16 మందిని వీఆర్‌కు పంపి కంటితుడుపు చర్యలు చేపట్టారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఎదురుచూస్తుంటే.., ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు.