Illegal Transportation of Soil: కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా చినకాకాని ప్రాంతంలో జరిగే జాతీయ రహదారి బైపాస్ పనుల కోసం.. కొన్నిరోజులుగా రేయింబవళ్లు లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒకేసారి 14 లారీలు వెళుతుండటంతో.. రాత్రి గస్తీలో ఉన్న మంగళగిరి ఎస్సై మహేంద్ర వాటిని ఆపి పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేకుండా గ్రావెల్ రవాణా చేస్తున్నట్లు గుర్తించి, సీఐ అంకమ్మరావుకు సమాచారం అందించారు. అయితే శుక్రవారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదు. గనుల శాఖ అధికారులు పరిశీలిస్తే, జరిమానా వేసి కేసును వారికి అప్పగిస్తామని సీఐ చెబుతున్నారు. పట్టుకున్న లారీలను మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లే మార్గంలో నిలిపారు.
16వ నెంబర్ జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. గుంటూరు జిల్లా వైపు పనుల ప్యాకేజీని ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయక్తంగా దక్కించుకున్నాయి. కృష్ణా జిల్లా వైపు ప్యాకేజీని మరో సంస్థ సొంతం చేసుకుంది. ఈ పనులకు గ్రావెల్ సరఫరా చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్టు తీసుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో పోలీసులు పట్టుకున్న లారీలు ఈ సంస్థలకే గ్రావెల్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వాహనాలు ఓ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులవిగా అనుమానిస్తున్నారు.
కొంతకాలంగా విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో కొంత పట్టా భూమి, మరికొంత ప్రైవేటు భూమి కలిపి.. దాదాపు 100 ఎకరాల్లో పొక్లెయిన్లతో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. స్థానికులు అడ్డుకుంటే తాము ఎంపీ మనుషులమంటూ బెదిరించారు. తవ్వకాలపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు. కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్ తవ్వే ప్రాంతాన్ని జాతీయ రహదారి పనుల్లో ఈ ప్యాకేజీ కోసం కేటాయించలేదు. అయినా కొత్తూరు తాడేపల్లి నుంచి విజయవాడలోని కనకదుర్గ వారధి మీదుగా నిత్యం బైపాస్‌కు తరలిస్తున్నారు. ఒక్కో లారీ గ్రావెల్ 15 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే కొన్ని రోజులుగా కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా ఎత్తుకుపోయారు.
గ్రావెల్ లారీలను పోలీసులు పట్టుకోవడం, దీని వెనుక సూత్రధారిగా ఓ ప్రజాప్రతినిధి పేరు తెరపైకి రావడంతో.. కేసు నమోదుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గుత్తేదారు సంస్థకు గ్రావెల్ తరలించేందుకు అనుమతులు ఉన్నాయని, వాటి ఆధారంగా వదిలేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే సదరు ప్రజాప్రతినిధి మాత్రం.. సంబంధం లేని ఈ విషయంలోకి అనవసరంగా తన పేరు తెస్తున్నారని ఖండిస్తున్నారు. వాహనాలను పోలీసులు పట్టుకున్న వ్యవహారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినా.. అవి ఎవరివి అనేది మాత్రం వెల్లడించడం లేదు. .
విజయవాడ వ్యక్తులే తమ యజమానులని.. పట్టుబడిన లారీల డ్రైవర్లు చెబుతున్నారు. పోలీసులు వారి నుంచి పూర్తి వివరాలు మాత్రం రాబట్టలేదు. ఈ లారీలను నిర్మాణ సంస్థకు అద్దెకు ఇచ్చినట్లు, వారే గ్రావెల్ రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేయకుండా గనుల శాఖ నివేదిక కోసం నిరీక్షిస్తున్నారు. దీనిపై కృష్ణా జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకులు సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించగా.. గ్రావెల్ పట్టుకున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు.
కొత్తూరు తాడేపల్లిలో తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు ఉన్నారని చెప్పారు. 14 లారీలను సీజ్ చేసినట్లు పోలీసులు సమాచారమిచ్చారని, వివరాలు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని గుంటూరు గనుల శాఖ సహాయ సంచాలకులు రంగకుమార్ పేర్కొన్నారు. గ్రావెల్ లారీలను పట్టుకోవడంతో.. విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో ప్రభుత్వ, పట్టా భూముల్లో తవ్వకాలను నిలిపివేశారు.
ఇవీ చదవండి: