అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎం) రాష్ట్ర అధ్యక్షుడిగా వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ నియమితులయ్యారు. ఏబీహెచ్‌ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు ఆచార్య జీవీఆర్ శాస్త్రి ఆదివారం ఈ మేరకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అమరావతి విషయంలో రైతులకు అండగా నిలబడలేకపోతున్నామని.. శనివారం మందడంలో జరిగిన కార్యక్రమంలో భాజపా అధికార ప్రతినిధి అయిన గోపాలకృష్ణ ప్రసాద్ చెప్పుతో కొట్టుకున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారని పేర్కొంటూ.. రాష్ట్ర భాజపా అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించారు.
భాజపా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాజధాని అమరావతిపై జరిగిన పార్టీయేతర కార్యక్రమంలో పాల్గొన్న గోపాలకృష్ణ ప్రసాద్.. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందాయని వివరించారు. రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదనేది పార్టీ అధికారిక విధానమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది