Government Neglects to Pay Compensation to Farmers : రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, వారికి అండగా నిలిచే పార్టీనే వైఎస్సార్సీపీ అని సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు. అదే రైతు మేము కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని ఆదుకో మహాప్రభు అంటూ గగ్గోలు పెడుతున్న పట్టించుకోకుండా అదిగో పరిహారం, ఇదిగో పరిహారమని కాలయాపన చేస్తున్నారు. మిగ్జాం తుపాను ప్రభావం వల్ల రైతులు నష్టపోయి రెండు నెలలు అవుతున్న వారికి మాత్రం నేటికి నష్టపరిహరం అందలేదు.
చెప్పిన సమయానికే అన్నదాతలకు రావాల్సిన, ఇవ్వాల్సిన సొమ్మును చెల్లిస్తున్నామని ప్రకటిస్తుంటారు. కానీ అదంతా ఒట్టిమాటే అంటున్నారు కృష్ణా జిల్లా రైతులు. మిగ్జాం తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు సంక్రాంతిలోపే పరిహారం ఇస్తామని చెప్పారే కానీ ఇప్పటికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ కాలయాపనతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
పంటలు మునిగి ఒకచోట, ఎండిపోయి మరోచోట - రాష్ట్రంలో దయనీయంగా రైతు పరిస్థితి
Krishna District Cyclone Effect : మిగ్జాం తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నేల వాలింది. కొన్ని చోట్ల కోసేందుకు సైతం పంట పనికిరాకుండా పోయింది. వ్యవసాయం చేయాడానికి అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, తుపాను తాకిడికి రోడ్డున పడ్డామని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం పడ్డ కష్టం అంతా వృథా అయిందంటూ బోరుమన్నారు. తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించినప్పుడు తమ కష్టాలు తొలగిపోతాయని ఆశ పడ్డారు. పంట పొలాలను అధికారులు పరిశీలించి నష్ట వివరాలు నమోదు చేసినప్పుడు ఇంకా ప్రభుత్వం తమకు పరిహారం చెల్లిస్తుందని ఆనందించారు. ఇప్పుడు చూస్తే సంక్రాంతి పండగ వెళ్లిన పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అశ్రద్ధ చూపుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Government Compensation : ప్రభుత్వ తీరుతో రైతుల పండగైన సంక్రాంతిని కూడా జరుపుకోలేకపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేెంద్రాల్లో జాబితాలను ఉంచి అందులో పేరు లేకపోతే మళ్లీ నమోదుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందన్న రైతులు కొన్ని చోట్ల అసలు జాబితానే పెట్టలేదని చెబుతున్నారు. కోసిన ధాన్యాన్నైనా అమ్ముకుందామంటే అందులోనూ నిబంధనల పేరుతో రకరకాల ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ఓ వైపు పరిహారం రాకపోవడం, మరోవైపు మళ్లీ పంట వేసేందుకు అప్పులు పుట్టకపోవడంతో ఏం చేయాలో తెలియట్లేదని రైతులు వాపోతున్నారు.