4 శతాబ్దాల క్రితమే అదో వాణిజ్య కేంద్రం. ఇప్పటికీ విదేశాలకు.. ఎగుమతుల ద్వారా మారకద్రవ్యం అర్జిస్తోంది. పేరుగొప్ప ఊరు దిబ‌్బలా అక్కడ స్థాయికి తగ్గ అభివృద్ధి లేదు. కనీస వసతులు కరవై విలువైన మత్స్య సంపదకు గిరాకీ లేకుండా పోయింది. కృష్ణాజిల్లా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ కొలిక్కిరాకపోవడం అక్కడి అభివృద్ధికి శాపంగా మారింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా వందల ఏళ్లక్రితమే సముద్ర రవాణా జరిగినట్లు ఆధారాలున్నాయి. బ్రిటీషర్ల పాలనలోనూ ఇక్కడి పోర్టు కీలకంగా.. వ్యవహరించింది. నేటికీ గిలకలదిండి కేంద్రంగా.. టన్నుల కొద్దీ సరుకు లారీలు, కంటెనర్లలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. గన్నవరం విమానాశ్రయం ద్వారా.. విదేశాలకూ వెళ్తుంది. ఏటా లక్షన్నర టన్నుల వరకూ గిలకలదిండి నుంచి ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.
ఇంత మొత్తంలో..వ్యాపారం జరుగుతున్నా.. ఇక్కడ కనీస సదుపాయాల్లేవు. 348 కోట్లతో గిలకదిండి హార్బర్ అభివృద్ధి పనులు చేపట్టినా.. అవి ఎంతకీ కొలిక్కిరావడం లేదు. గిలకలదిండిలో.. సముద్ర ముఖద్వారం వద్ద కాలువ తూర్పువైపుగా ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. సముద్రపు అలలు ఉత్తర దిశగా వస్తుండటంతో ముఖద్వారం వద్ద ఇసుక మేట వేస్తోంది. అలాజరగకుండా.. కిలోమీటర్ మేర సముద్రంలో రాళ్లకట్ట వేయాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.
ఎన్టీఆర్ హయాంలో కొంత ప్రయత్నాలు జరిగినా.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదంటున్నారు. డ్రెడ్జింగ్ పనులు నెలల తరబడిసాగడంతో పడవలు ఇసుక మేటల్లో కూరుకుపోయి నష్టపోతున్నారు మత్స్యకారులు. ఇసుక మేటలు పూర్తిగా తొలగిస్తే తప్ప..వేట సులువుగా సాగదంటున్నారు మత్సకారులు.
ఇదీ చదవండి:
Huge Floods to Godavari: గోదావరికి వరద ఉద్ధృతి.. సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కులు!