I am also for justice : రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ మొదలుకుని నంద్యాలలో భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం వరకూ వేల మంది దళితులు, మైనార్టీలు, పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. వారంతా జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బాధితులందరికీ అండగా నిలిచి, న్యాయం కోసం పోరాడేందుకు దశ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. విజయవాడలోని జింఖానా మైదానంలో జైభీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘నేను సైతం న్యాయం కోసం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వేధింపులు, కేసులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాల చేతుల మీదుగా దశ యాప్‌ను ఆవిష్కరించారు.
అన్ని రకాలుగా వేధింపులు.. అన్ని రకాలుగా వేధింపులు.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నడూ చూడని అరాచక ఘటనలు జరుగుతున్నాయని శ్రావణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళితే న్యాయం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారని పేర్కొన్నారు. చట్టం గురించి 99శాతం మంది బాధితులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఏ న్యాయస్థానానికి వెళ్లాలో, ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.
రాక్షస పాలన అంతమే ధ్యేయం.. రాక్షస పాలన అంతమే ధ్యేయం.. సొంత బాబాయిని చంపిన వాళ్లు రూ.కోట్లు ఖర్చు పెట్టి తప్పించుకుంటుంటే.. దళితులు, పేదలు చిన్న, చిన్న సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాల చుట్టూ దశాబ్దాల పాటు తిరుగుతున్నారని అన్నారు. అందుకే, ఇలాంటి వారందరి కోసం దశ యాప్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. జగన్ రాక్షస పాలనను అంతం చేసి రాష్ట్రాన్ని కాపాడడానికి తన చివరి శ్వాస వరకూ పోరాటం చేస్తానని శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు.
న్యాయవాదుల బృందం.. న్యాయ సహాయం కోసం బాధితులు ఏ మారుమూల గ్రామం నుంచి మెసేజ్ పెట్టినా.. అనుభవజ్ఞులైన న్యాయవాదుల బృందం అండగా నిలుస్తుందని శ్రావణ్‌కుమార్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా 50మంది న్యాయవాదులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మహిళా సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. బాధితులే నిందితులుగా మారుతున్న ఈ ప్రభుత్వంలో న్యాయం దొరికే ఏకైక వేదికగా దశ యాప్ ఉంటుందన్నారు. యాప్‌ను అధికారికంగా ప్రారంభించక ముందే 300మందికి పైగా తమ సమస్యలను అప్‌లోడ్ చేశారన్నారు. ఎవరైనా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని న్యాయ సహాయం పొందొచ్చని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా, ఏ పని చేస్తూ అయినా మొబైల్ యాప్ ద్వారా న్యాయ సాయం కోరవచ్చు. హైకోర్టుకు చెందిన న్యాయవాదులు వెంటనే తిరిగి బాధితుల్ని సంప్రదించే వ్యవస్థ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. 24 గంటల్లోగా స్పందించి సమస్యను తెలుసుకుని న్యాయ సాయం అందిస్తారు. మీరు నిజంగా న్యాయానికి అర్హులైతే న్యాయాన్ని మీ ముంగిట ఉంచడమే జై భీమ్ పార్టీ లక్ష్యం. - జడ శ్రావణ్‌కుమార్, జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు
ఇవీ చదవండి :