వాతావరణం అనుకూలించకపోవడం, కొవిడ్ కారణంగా కూలీలు అందుబాటులో లేకపోవడం, తదితర కారణాలతో అధిక శాతం రైతులు యంత్రాల సాయంతో పంటను కోయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం నమూనాల్లో తేమను లెక్కించి 17 శాతం కన్నా తక్కువ ఉంటే మద్దతు ధర ఇవ్వాల్సి ఉంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్లకు పంపిస్తే, వద్దని తిరిగి పంపించేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1122 రకం ధాన్యం 75 కేజీల బస్తాకు ప్రభుత్వం రూ. 1,401 మద్దతు ధర నిర్ణయిస్తే కేవలం రూ.1000 నుంచి రూ. 1100 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
నిల్వ చేయడం వల్లే..
గతంలో పాత ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చినతుమ్మిడి, సాతులూరు, తదితర గ్రామాల్లో సార్వా పంట కోతలు కోసి కుప్పలు వేశారు. సార్వా పంట కొనుగోలు ప్రక్రియ ముగియడంతో దొరికిందే అదనుగా పలువురు వ్యాపారులు ఇప్పడు రబీ ధాన్యంతో కలిసి అమ్ముకోవాలని సలహాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తడవకుండా పాట్లు
14 ఎకరాలు కౌలుకు తీసుకొని 126 రకం వరి సాగు చేశాను. ఎకరాకు సుమారు 27 బస్తాల ధాన్యం పండింది. సరైన గిట్టుబాటు ధర అందక ప్రస్తుతం ధాన్యం వానకు తడవకుండా పరదాలతో భద్రపరిచాను. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1416 ప్రకటించగా, రూ. 1000కు అడుగుతున్నారు. - పులి నాగబాబు, కౌలు రైతు, బంటుమిల్లి
నిబంధనలు పాటించకపోతే చర్యలు
మిల్లర్లు ధాన్యం వద్దని తిరిగి పంపిస్తే మా దృష్టికి తీసుకురావాలని రైతులకు చెప్పాం. అటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. సంచులు లేవని వంకలు చూపితే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. ప్రభుత్వం తెలిపిన నిబంధనలను పాటించకపోతే కొనుగోలుదారులపై చర్యలు తప్పవని. బంటుమిల్లిల తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ
ఇవీ చూడండి…: ప్రభుత్వం కేటాయించినా.. అందని సరకులు