రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరాహార దీక్ష చేపట్టారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనను చూసి విసిగిపోయిన ప్రజలు.. తెదేపా పాలన కోరుతున్నారని ఆమె అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నికలను వాయిదా వేస్తే.. అధికార దాహంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ముగించడం సరైంది కాదని ధ్వజమెత్తారు. ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ.. నాకు ఎన్నికలే ముఖ్యం అనే ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.