కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి ఆశాజనకంగా ఉందని... దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చేదిగా ఉందని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లోనే వైద్యం, ఆరోగ్యపరమైన అంశాల్లో దేశం ప్రథమస్థానంలో నిలుస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి కచ్చితంగా మన దేశం రెండంకెల వృద్ధిని సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థితి కుదేలైన వేళ... ప్రజల ఆరోగ్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించడం శుభపరిణామమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాముఖ్యం ఇచ్చిందని... దీనివల్ల పారిశ్రామికంగా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని.. వైద్య రంగంలో సమూల మార్పులు చేస్తున్నామని కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
పాస్‌పోర్టు సులభతరం
నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విదేశీ ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదేళ్ల కిందట పాస్‌పోర్టు పొందేందుకు చాలా ఇబ్బందులు ఉండేవని... ఇప్పుడు వాటిని చాలా సరళతరం చేశామన్నారు. తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. పాస్‌పోర్టు రెన్యువల్‌ను దేశంలో ఎక్కడి నుంచైనా చేసుకునే వీలు కల్పించామన్నారు. అలాగే విదేశాల్లో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మదర్ పోర్టల్ ద్వారా వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ చర్యల వల్ల పాస్‌పోర్టులు సంఖ్య పెరిగిందని... అలాగే విదేశీ ప్రయాణికులు పెరిగారని చెప్పారు.
తెలుగువారికి కష్టపడేతత్వం ఎక్కువ
విదేశాల నుంచి ఔషదాల కోసం ఎక్కువ సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 15 దేశాలకు కరోనా వాక్సిన్ ఎగుమతి అవుతోందని... మరో 25 దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. తాను విదేశాంగ మంత్రిగా ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించానని- అన్నిచోట్ల తెలుగువారు కనిపించారని... కష్టపడే తత్వం... తెలివితేటలు వీరికి ఎక్కువ అని ప్రశంసించారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. త్వరలో మూడు క్లస్టర్లు రాష‌్ట్రంలో ఏర్పాటు అవుతాయని కేంద్రమంత్రి జయశంకర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసిందనే రాజకీయ పార్టీల విమర్శలను ఎంపీ జీవీఎల్ తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో ఇప్పటికీ కేంద్రానికి సమగ్రమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు పంపలేదన్నారు.
ఇదీ చదవండి:
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు