అమరావతి రాజధాని ప్రాంతంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి గత మూడు నెలల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 2019 తొలి త్రైమాసికంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే 3 లక్షల 20 వేల మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నాలుగేళ్ల ముందు వరకూ ఏడాది మొత్తానికి కలిపి చూస్తే మూడు లక్షల మంది ప్రయాణికులకు మించి ఉండే వారు కాదు. తాజాగా 3నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోతోంది. గగన మార్గంలో రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. విమాన ప్రయాణికులకు సంబంధించి గత 3నెలల నివేదికలో గతేడాది కంటే భారీగా ఈ పెరుగుదల కనిపించింది. 2018లో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 3.08 లక్షల మంది ప్రయాణించగా.. ఈ ఏడాది మరో 11వేల మంది పెరిగారు. తాజా నివేదిక ప్రకారం నెలకు లక్ష 10 వేల మందికిపైగా ప్రయాణికులు ఒక్క గన్నవరం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి త్రైమాసికంలో ప్రయాణికుల రద్దీ
2018 సంవత్సరంలో
నెల | రాక | పోక | మొత్తం |
ఏప్రిల్ | 50,640 | 47,358 | 97,998 |
మే | 54,659 | 53,769 | 1,08,428 |
జూన్ | 54,544 | 48,016 | 1,02,560 |
2019 సంవత్సరంలో
నెల | రాక | పోక | మొత్తం |
ఏప్రిల్ | 49,316 | 47,354 | 96,670 |
మే | 58,554 | 54,941 | 1,13,495 |
జూన్ | 58,361 | 51,939 | 1,10,300 |
గన్నవరం విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులు దేశంలోని 8నగరాలకు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఈ సర్వీసుల్లో వెళ్లే వారి కంటే.. అటునుంచి వస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. అంతర్జాతీయ విమాన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే గన్నవరం విమానాశ్రయం ఓ ఘనమైన విమానాశ్రయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ప్రయాణికులు.
ఇవీ చదవండి