CHILDRENS DEAD: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో మున్నేరులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా స్నేహితులందరూ కలిసి గ్రామం చివర ఉన్న ఏటికి ఈతకు వెళ్లారు. సాయంత్రమైనా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. అన్నిచోట్లా వెతికారు. మున్నేటి ఒడ్డున సైకిళ్లు, చెప్పులు, దుస్తులు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏటి మధ్యలో గట్టుపై ఎక్కడో ఒకచోట బిడ్డలు క్షేమంగా ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతులు ఏటూరుకు చెందిన గురజాల చరణ్, కర్ల బాలయేసు, జెట్టి అజయ్, మాగులూరి సన్నీ, మైలా రాకేశ్‌గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన చిన్నారులు... గతంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన గుంతలు గుర్తించక నీట మునిగి చనిపోయారు. తొలుత ఈతగాళ్లు, జాలర్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. మున్నేరు జల్లెడపట్టిన బృందం ఒక్కొక్క మృతదేహాన్ని వెలికితీసింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు.
ఇదీ చదవండి: