శుక్ర, శనివారాలతో పోలిస్తే ఆదివారం నామపత్రాలు అధికంగా దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు స్వీకరణ గడువు ముగియాలి. పెనగంచిప్రోలు, వత్సవాయి తదితర గ్రామాల్లో నిర్ణీత గడువుకు కేవలం గంట ముందు పదుల సంఖ్యల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసేందుకు కేంద్రాల వద్దకు చేరుకోవడంతో కాస్త ఆలస్యమైంది. విజయవాడ డివిజన్‌లో 9,278 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో సర్పంచి పదవులకు 1,389, వార్డులకు 7,889 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన ఆదివారం 6,402 నామినేషన్లు స్వీకరించారు.
సర్పంచి స్థానాలకు వత్సవాయి మండలంలో అత్యధికంగా 167 నామపత్రాలు దాఖలు కాగా.. వార్డులకు కూడా వత్సవాయి మండలంలో 822 నమోదయ్యాయి. సోమవారం నుంచి ఎన్నికల ఘట్టమైన నామినేషన్లు పరిశీలించి సక్రమంగా లేని వాటిని తిరస్కరిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ తిరస్కరణకు గురైనవారు అప్పీలేట్ అథారిటీ అధికారికి దరఖాస్తు చేసుకుంటే 3వ తేదీ వాటిని పరిష్కరిస్తారు. నాలుగో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత ఆర్వోలు తుది జాబితాను ప్రకటిస్తారు.
ఇది నీకు.. అది నాకు..
విజయవాడ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు తెదేపా, వైకాపాలతో పాటు జనసేన, భాజపా, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటాపోటీగా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో పలు చోట్ల లోపాయికారి ఒప్పందాలు జరిగాయి. ఆయా గ్రామాల పరిస్థితులను బట్టి పొత్తులు-పంపకాలు తెరపైకి వచ్చాయి. సర్పంచి, ఎంపీటీసీ పదవులపై ఒప్పందాలు జరిగాయి. అలాగే కొన్నిచోట్ల సర్పంచి పదవులను పంచుకున్నట్లు తెలిసింది. తెదేపా, వైకాపా మద్దతు పలికిన అభ్యర్థులు పోటీలో ఉండేలా నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ ఎన్నికల తర్వాత వచ్చే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రాబల్యాలు చూసుకోవచ్చని, ప్రస్తుతానికి సర్దుబాటే మేలు అనే నిర్ణయానికి వచ్చిన నాయకులు పంతాలు, పట్టింపులకు పెద్దపీట వేయలేదు.
మేజర్ పంచాయతీలైన మైలవరం, రామవరప్పాడు, కంచికచర్లలో అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. రామవరప్పాడులో సర్పంచి స్థానానికి వైకాపా వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఒకరిని ఎమ్మెల్యే వంశీ బలపరచగా.. మరొకరికి యార్లగడ్డ వర్గం మద్దతు తెలుపుతోంది. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో ఒప్పందం ప్రకారం సర్పంచి స్థానం తెదేపాకు ఇవ్వకపోవడంతో తెదేపా నేత ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన భార్య మురుకుట్ల పద్మావతి సర్పంచి అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు.
ఏకగ్రీవాల పరిస్థితి ఇదీ.!
తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో సర్పంచి స్థానానికి వైకాపా బలపరిచిన మరీదు వెంకటేశ్వరరావుతో పాటు.. గ్రామంలోని పది వార్డులకు ఒక్కో నామినేషనే దాఖలైంది. వీటితో పాటు యాకమూరు, గురివిందపల్లి, కనకవల్లిలు కూడా ఏకగ్రీవమయ్యాయి. యాకమూరులో సర్పంచి స్థానానికి వచ్చిన రెండు నామినేషన్లు ఒకే కుటుంబ సభ్యులవే. జి.కొండూరు మండలంలో వెంకటాపురం, కందులపాడు ఏకగ్రీవాలయ్యాయి.కందులపాడులో వైకాపా, తెదేపా బలపరిచిన అభ్యర్థులు పాలనా కాలాన్ని పంచుకున్నట్లు సమాచారం.
కంకిపాడు మండలంలో నెప్పలిలో సర్పంచి స్థానానికి వైకాపా మద్దతుదారుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మైలవరం మండలంలో కొత్తగా ఏర్పాటైన సీతారాంపురం తండా ఏకగీవ్రమైంది. నందిగామ మండలంలో కేతవీరునిపాడు గ్రామంలో సర్పంచి, 12 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలైంది. చందర్లపాడు మండలంలో బొబ్బళ్లపాడులో సర్పంచి స్థానానికి వైకాపా మద్దతుదారులైన భార్యాభర్తలు నామపత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఒకరు సర్పంచి అయ్యే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: