విజయవాడ డివిజన్ నుంచి తొలి కిసాన్ రైలు ప్రారంభమైంది. నూజివీడు రైల్వేస్టేషన్ నుంచి దిల్లీకి మామిడి ఎగుమతులతో ఆదివారం బయలుదేరిన ఈ రైలును విజయవాడ సీనియర్ డీసీఎం భాస్కరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రైల్వేశాఖ సరకు రవాణాపై 50 శాతం రాయితీ ఇస్తుండడంపై.. వ్యాపారులు, రైతులు ఈ రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. తొలి రోజు కిసాన్ రైలు ద్వారా 20 జనరల్ బోగీల్లో 220 టన్నుల మామిడి కాయలు రవాణా చేశారు. దీని ద్వారా విజయవాడ డివిజన్‌కు రూ.9.90లక్షల ఆదాయం లభించింది.
ఈ సీజన్‌లో 35 నుంచి 40 రేక్‌ల ద్వారా మామిడికాయలు రవాణా చేసి రూ.4 కోట్ల ఆదాయాన్ని ఆర్జించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా రవాణా చేస్తామని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇచ్చే రాయితీలపై రైతులు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రఖ్యాతి గాంచిన చిన్న రసాలు, పెద్ద రసాలను నూజివీడు నుంచి త్వరితగతిన గమ్యస్థానం చేరేలా రవాణా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలి కిసాన్ రైలును విజయవంతంగా దిల్లీకి పంపినందుకు అధికారులను డీఆర్‌ఎం (కమర్షియల్) పి.శ్రీనివాస్ అభినందించారు.
ఇదీ చదవండి: