నిన్న మొన్నటి వరకు సిరులు కురిపించిన టమాటా పంట.. నేడు రైతుల కంట నీరు తెప్పిస్తోంది. పాతాళానికి పడిపోయిన ధరలతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. రైతుబజార్‌లోనూ కనీస ధరకు కొనుగోలు చేసేవారు లేరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం రైతుల దుస్థితి ఇది. సుమారు వేయి ఎకరాల్లో టమాటా సాగు చేశారు అక్కడి రైతులు. గతంలో 30 కేజీల టమాటా బాక్స్... వంద నుంచి 150 రూపాయల ధర పలికేది. ప్రతి సీజన్‌లో లాగే... పండించిన పంటను రైతులు శుక్రవారం గుడివాడ రైతుబజార్‌కు తీసుకెళ్లారు. 30 కేజీల బాక్స్ 20 రూపాయలైనా రాలేదు. బిక్కమొహం వేసిన అన్నదాత... రైతుబజార్‌కు తీసుకెళ్లిన వాహనంలోనే వెనక్కి తీసుకొచ్చి... 200 బాక్సులను కృష్ణానదిలో పారబోశారు.
ఎకరానికి కొందరు రైతులు వేలల్లో పెట్టుబడి పెడితే... మరికొందరు కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు. ఎంతోకొంత వెనకేసుకోవచ్చని పండించిన పంట కాస్త ముంచేసిందని వాపోతున్నారు. రైతుబజార్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి చేసుకుంటున్నారు కానీ... స్థానికంగా పండించిన టమాటా కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ పరిస్థితి చూసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి... గ్రామాల్లో టమాటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : రెండు దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు!