శిరస్త్రాణం (హెల్మెట్) లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారా? సీటు బెల్ట్ ధరించకుండా వాహనం డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే రవాణాశాఖ అధికారులు, పోలీసులు పట్టుకుంటే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. తొలిసారి అయితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. రహదారి భద్రతలో భాగంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్రం మోటారు వాహన చట్టంలో సవరణలు చేయగా, అవి గతేడాది సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 8 సెక్షన్ల కింద ఉల్లంఘనలకు పాల్పడితే తొలిసారి మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి, లైసెన్స్‌దారుడికి అవగాహన కార్యక్రమం నిర్వహించాక లైసెన్స్ పునరుద్ధరిస్తారు. మరోసారి అదే తప్పుచేస్తే మాత్రం లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అందరికీ తెలిసేలా ఉంచుతారు. ఈ నిబంధనల్లో సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడుపుతున్న వారిలో ఎంతమంది లైసెన్స్‌లు రద్దు చేశారో ఆ వివరాలను సుప్రీంకోర్టు కమిటీ కోరింది. దీంతో అన్ని జిల్లాల రవాణాశాఖ ఉప కమిషనర్‌లు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఎన్ని లైసెన్స్‌లు రద్దు చేశారో.. వివరాలు తెలపాలంటూ ఆ శాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు.
మరికొంత సమయం..
రాష్ట్రంలో ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రవాణాశాఖ అధికారులు, పోలీసులు తొలిసారి లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన తర్వాత, ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే రెండోసారి ఆ లైసెన్స్‌దారుడు అదే తప్పు చేశారా? లేదా? అనేది తెలుస్తోంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ సిద్ధమయ్యేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
లైసెన్స్‌ల రద్దుకు వర్తించే సెక్షన్లు ఇవి..
సెక్షన్ 206 కింద డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా సవరణ చట్టం తీసుకురాగా, దీని పరిధిలోకి 8 సెక్షన్ల ఉల్లంఘనలు వస్తాయి. వేగంగా నడపటం, సెల్‌ఫోన్, కమ్యూనికేషన్ డివైజ్ ఉపయోగిస్తూ ప్రమాదకరంగా నడపటం, మద్యం సేవించి లేక డ్రగ్స్ తీసుకొని నడపటం, స్పీడ్ రేసింగ్ నిర్వహించడం, సురక్షితంగా లేని వాహనం ఉపయోగించడం, ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం, అత్యవసర వాహనాలకు దారివ్వకపోవడం తదితరాలు వస్తాయి.
ఇవీ చదవండి