దేవాదాయశాఖలో గతంలో లేనట్టుగా సంస్కరణలు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుమల, అన్నవరం, కనకదుర్గ తదితర ఆలయాలను ఆన్లైన్ సేవల ద్వారా భక్తులకు దగ్గర చేసినట్లు తెలిపారు. విజయవాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతీ దేవాలయంలోనూ గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా.. "ధర్మపథం" పేరిట కార్యక్రమాలు త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ స్కీం ద్వారా.. శ్రీశైలం లాంటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునరుద్ధరణ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రీ-సర్వేలో దేవాదాయశాఖ భూములను మొదటగా సర్వే చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. మొత్తం నాలుగు లక్షల ఎకరాల దేవాదాయ భూముల్లో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటిని రికవరీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల వద్ద ఎక్కువగా అన్యమత ప్రచారం జరగడం లేదన్నారు. ఇటీవల శ్రీశైలం, తిరుపతిలో జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేవాలయ ఆస్తుల లీజు వసూలు విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని, దుకాణాలు, భూముల నుంచి వారిని ఖాళీ చేయిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: