ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య కోర్టును ఆశ్రయించారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని పేర్కొన్నారు. సెక్షన్ 78(1) కి విరుద్ధమైన జీవో రద్దుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.
న్యాయపరంగా ముందుకెళ్తాం - కె.వి. కృష్ణయ్య
"విభజన చట్టం ప్రకారం వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో వేతనాల్లో కోత పడుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొంది. పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమిస్తూనే న్యాయపరంగా ముందుకెళ్తాం. సీఎస్, ఆర్థిక శాఖ, రెవెన్యూ, కేంద్ర హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చాం" - కె.వి.కృష్ణయ్య, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు..!
ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సీఎఫ్‌ఎంఎస్ సిద్ధం చేసింది.
ap employees protest : పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును.. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు.
మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఈరోజు జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించేందుకు యత్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగించారు. పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి
అప్పుడు పీఆర్సీకి అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదు: మంత్రి సురేశ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!