Secunderabad Fire Accident Updates: తెలంగాణలోని సికింద్రాబాద్ నల్లకుంటలోని దక్కన్‌మాల్ ఘటనలో లభించిన మృతదేహం ఆనవాళ్లను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించారు. మృతదేహం ఎవరిదనేది నిర్ధారించడానికి డీఎన్ఏ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. అగ్నిప్రమాదం జరిగిన 20వ తేదీ నుంచి ముగ్గురు ఆచూకీ లేకుండా పోయారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న వస్తువులను కిందకు తీసుకెళ్లేందుకు వసీం, జునైద్, జహీర్ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. రెండు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 21వ తేదీ సాయంత్రం అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి వెతికారు. అక్కడ ఓ మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. ఎముకలతో పాటు బూడిదను ఓ సంచిలో చుట్టి గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మిగతా రెండు మృతదేహాల కోసం భవనం మొత్తం వెతికినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆచూకీ లేకుండా పోయిన ముగ్గురిలో మృతదేహం ఎవరిదనేది గుర్తించడం కష్టసాధ్యంగా మారడంతో డీఎన్ఏ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ముగ్గురి కుటంబ సభ్యుల డీఎన్ఏ సేకరించి, పోలీసులు సేకరించిన ఎముకల డీఎన్ఏతో సరిపోల్చనున్నారు. ఎవరి కుటుంబసభ్యులతో సరిపోతే ఆ వ్యక్తిగా గుర్తించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు కనీసం వారం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే.. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. ఐదు అంతస్తుల భవనం, పెంట్‌హౌజ్‌లో దక్కన్ నైట్‌వేర్ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి. సమీపంలోని మరో నాలుగు భవనాలకూ మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలంలో 22 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మంటలను అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి.. సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా పైనున్న వారిని దించటం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి, అతి కష్టంమీద భవనంలో చిక్కుకున్న ఒకరిని బయటకు తీసుకొచ్చారు. మరో ముగ్గురు అందులోనే చిక్కుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరి మృతదేహం ఆనవాళ్లు లభించగా.. నేడు డీఎన్ఏ పరీక్ష కోసం పంపించారు.
ఇవీ చూడండి..